ఆటోవాలాలకు 100 రోజుల ఉపాధి కల్పిస్తాం!

రెక్కాడితే కానీ డొక్కాడని ఆటోవాలా కుటుంబాలకు మంత్రి హరీష్‌రావు బాసటగా నిలిచారు. సిద్దిపేట సీసీ గార్డెన్స్‌లో గ్రామీణ ప్రాంతాల్లోని 312 మంది ఆటోవాలా కార్మిక కుటుంబాలకు నిత్యావసర వస్తువులను మంత్రి పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 3 వేల పైచిలుకు మంది ఆటోవాలాలకు ప్రభుత్వం, తాను అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆటో కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద 100 రోజులక పని కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైన వాళ్లు ఉపాధి హామీ జాబ్‌కార్డులను ఆయా గ్రామాల సర్పంచ్‌ల వద్ద తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జాబ్‌కార్డు తీసుకున్న వారందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తామని హరీష్‌ రావు చెప్పారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిందని మంత్రి గుర్తు చేశారు. లాక్‌డౌన్‌కు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని, సామాజిక దూరం ప్రతి ఒక్కరూ పాటించాలని మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.