కేంద్రానికి సీతారాం ఏచూరి సూచ‌న‌లు

క‌రోనా నియంత్ర‌ణ‌కు కేంద్రం స‌రైన ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగ‌డం లేద‌ని సీపీఎం  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. వైర‌స్ కట్టడికి ప్రధాని మోదీ ఇప్పటికీ సరైన రోడ్‌మ్యాప్‌ వేయలేకపోతున్నారని విమ‌ర్శించారు. దేశంలోని పేద ప్రజానీకాన్ని ఆదుకునేందుకు కేంద్రం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కేవలం మాటలు, ప్రసంగాలతో కాలం వెళ్లదీస్తే స‌రిపోద‌న్నారు. ప్రపంచ దేశాలన్నింటిలో ఇండియా టెస్టింగ్‌ రేటు చాలా తక్కువగా ఉన్నదనీ.. మూడు వారాలు గ‌డిచిన అనుకున్నంత వేగంగా క‌రోనా ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కోవిడ్ పై పోరులో రాష్ట్రాలే ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నాయ‌ని తెలిపారు.


లాక్‌డౌన్ నేప‌థ్యంలో పేద ప్ర‌జ‌లు వ‌ల‌స కూలీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కేంద్రానికి ప‌లు సూచ‌న‌లు చేశారు. త‌క్ష‌ణ‌మే రాష్ట్రాల‌కు ఆహార ధాన్యాలు పంపిణీ చేయాల‌న్నారు. కేంద్ర గిడ్డంగుల్లో 7.5 కోట్ల ట‌న్నుల ఆహార ధాన్యాలు మూలుగుతున్నాయ‌ని...రాష్ట్రాల‌కు ఎందుకు పంపిణీ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే కోట్ల ట‌న్నుల ఆహార ధాన్యాలు ఉండ‌గా..ఇప్పుడు మ‌ళ్లీ కొత్త స్టాక్ రాబోతుంద‌న్నారు. వెంట‌నే రాష్ట్రాల‌కు నిధుల‌తో పాటు, ఆహార ధాన్యాలు పంపిణీ చేయాల‌న్నారు.